అర్హులైన ఏ ఒక్కరి   ఓటూ పోవద్దు..ఓటర్ల సవరణ ప్రక్రియ పకడ్బందీగా పూర్తిచేయాలి:  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

అర్హులైన ఏ ఒక్కరి   ఓటూ పోవద్దు..ఓటర్ల సవరణ ప్రక్రియ పకడ్బందీగా పూర్తిచేయాలి:  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
  • ఆదిలాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ‘సర్’ ప్రక్రియ పరిశీలన 

ఆదిలాబాద్, వెలుగు : ‘అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోవద్దు.. పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా ‘సర్’ ప్రక్రియ పూర్తి చేయాలి’అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి తాంసి మండలం ఘోట్కూరి, భీంపూర్ మండలం పిప్పల్‌‌కోటి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను, జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని డైట్ కళాశాల, సంజయ్‌‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి బీఎల్‌‌వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

బీఎల్‌‌వోల వద్ద ఉన్న దరఖాస్తులు, ఓటర్ల జాబితాలను పరిశీలించారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకునే వారి పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని చెప్పారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్లను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరిస్తున్నామని సుదర్శన్‌‌రెడ్డి తెలిపారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. 18ఏండ్లు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌‌వో లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలన్నీ సమగ్రంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్ ఎస్ చిత్రూ, ఎస్. రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.